: ఇళయరాజా పాటలను ఇంకా గాయకులు పాడుతుండడం వల్లే ఆయన గుర్తున్నారు!: తమ్మారెడ్డి భరద్వాజ
తాను కంపోజ్ చేసిన పాటలు పాడొద్దంటూ ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఇందుకు, ఇకపై ఆ పాటలు తాను పాడనని బాలసుబ్రహ్మణ్యం తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పేర్కొనడం విదితమే.
ఈ వివాదంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ, ఇళయరాజా పాటలను ఇంకా ఆయా గాయకులు పాడుతున్నారు కాబట్టే, ఆయన్ని ప్రేక్షకులు ఇంకా గుర్తు పెట్టుకున్నారని, ఆ పాటలు పాడటం ఆపేస్తే ఆయన్నిప్రజలు మరచిపోతారని అన్నారు. కాపీ రైట్ యాక్టు ప్రకారం నడచుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కానీ, యాక్ట్ పేరిట పాటలు పాడొద్దనడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. ఈ యాక్ట్ ను ఇప్పటికైనా సరళీకృతం చేస్తే బాగుంటుందని అన్నారు. ఆ రోజుల్లో ఫిల్మ్ ఛాంబర్స్ వారు అడ్డుపడి ఉంటే అసలు ఈ యాక్ట్ వచ్చేది కాదని, అప్పట్లో వారి కళ్లు మూసుకుపోయాయని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.