: దమ్ముంటే ఎల్లుండి జరిగే హింసను అడ్డుకోండి: యూపీ కొత్త సీఎంకు ఇస్లామిక్ స్టేట్ పేరిట హెచ్చరిక లేఖ
ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని పది రోజులయినా కాలేదు.. అయితే, ఆయనకు ఐఎస్ఐఎస్ పేరిట వార్నింగ్ ఇస్తూ ఓ లేఖ రావడం కలకలం రేపుతోంది. ఆయనకు దమ్ముంటే ఎల్లుండి పూర్వాంచల్‌లో జరిగే హింసను అడ్డుకోవాలని ఆ లేఖలో ఉంది. ఆ లేఖను ఈ రోజు అక్కడి పోలీసులు వారణాసిలోని మిర్జామురాద్ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ జిందాబాద్ అని కూడా రాసి ఉన్న ఆ లేఖలో పూర్వాంచల్ ప్రాంతంలో హింస సృష్టిస్తామని హెచ్చరికలు చేశారు. వారణాసి ప్రధానమంత్రి మోదీ నియోజకవర్గం కూడా కావడంతో ఆ లేఖపై పోలీసులు సీరియస్‌గా ఆరా తీస్తున్నారు. ఆ లేఖకు సంబంధించి ఇప్పటికే పోలీసులు పలువురు అనుమానితులని అరెస్టు చేశారు. యూపీ సీఎం తమ రాష్ట్రంలో గోవధపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొందరు ఈ లేఖ రాసినట్లు సమాచారం.