: ఏపీ శాసనసభలో జగన్ మైకును ఎన్నిసార్లు కట్ చేస్తున్నారో చూడండి: టీఎస్ శాసనసభలో విపక్ష సభ్యులకు సూచించిన హరీష్ రావు
తెలంగాణ శాసనసభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదంటూ అధికారపక్షంపై విపక్ష సభ్యులు మండిపడ్డారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సభ ద్వారా, స్పీకర్ ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నిస్తున్నామని... మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించారు. ప్రజల బాధలను తెలియజేసే బాధ్యత తమకుందని... తాము వేరే విషయాలపై మాట్లాడటం లేదని అన్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా ఈ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, పద్దులపై చర్చ సందర్భంగా 6.35 గంటసేపు టీఆర్ఎస్ మాట్లాడితే, 7.30 నిమిషాల పాటు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందని చెప్పారు. ప్రతిపక్షం మీద ఉన్న గౌరవంతోనే తాము విపక్ష సభ్యులకు మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇచ్చామని అన్నారు. గౌరవనీయులైన ప్రతిపక్ష నేత సూచనల మేరకు అన్ని పద్దులను తీసుకుంటామని ప్రకటిస్తూ నిన్న సభను వాయిదా వేశామని... అయితే ఆయన చుట్టూ ఇతర సభ్యులు ఉండటంతో తమ మాట ఆయనకు వినపడకపోయి ఉండవచ్చని తెలిపారు. పక్క శాసనసభలో (ఏపీ) ఏం జరుగుతోందో ఒక్కసారి చూడాలని... ప్రతిపక్ష నేత (జగన్) మైకును ఎన్నిసార్లు కట్ చేస్తున్నారో చూడాలని సూచించారు.