: వైఎస్ వివేకానందరెడ్డి ఓడిపోవడానికి కారణం ఇదేనా?


ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప జిల్లా నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ఓటమిపాలు కావడం పలువురిని షాక్ కు గురి చేసింది. తమ కంచుకోట కడప జిల్లాలో వివేకా ఓడిపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది. అయితే టీడీపీ నేతలంతా సమష్టిగా కృషి చేయడంతోనే వివేకా ఓడిపోయారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కడప జిల్లాలోని టీడీపీ నేతలంతా తమ మధ్య విభేదాలను పక్కన పెట్టి పార్టీ విజయం కోసం శ్రమించారు. అంతేకాదు, శిబిరాల నిర్వహణ, కోడ్ ప్రకారం ఓటు వేయించుకోవడం, సమీకరణలు ఇవన్నీ టీడీపీకి కలసి వచ్చాయి. పోలింగ్ కు ముందే మ్యాజిక్ ఫిగర్ కంటే 30 మంది ఓటర్లను టీడీపీ దగ్గర పెట్టుకోవడం గమనార్హం.

అయితే, క్రాస్ ఓటింగ్ తమకు లాభిస్తుందని వైసీపీ భావించింది. తమ పార్టీ నుంచి టీడీపీ వైపు వెళ్లినా, పోలింగ్ సమయంలో మనసు మార్చుకుని తమకే ఓటు వేస్తారని ఆశ పెట్టుకుంది. కానీ, వైసీపీ నుంచి టీడీపీ శిబిరంలోకి వెళ్లిన వారెవరూ క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదు. టీడీపీకే ఓటు వేశారు. ఇంకా చెప్పాలంటే, వైసీపీ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడకుండా చేయడంలో, టీడీపీ నాయకులు విజయవంతం అయ్యారు. ఓటర్లకు కోడ్ ఇచ్చి, క్రాస్ ఓటింగ్ జరగకుండా నివారించడంలో సఫలీకృతం అయ్యారు. అంతేకాదు, బీటెక్ రవి కుటుంబ సభ్యులు స్వయంగా వారిని కలిసి ఓటు వేయమని అభ్యర్థించడం కూడా క్రాస్ ఓటింగ్ జరగకుండా అడ్డుపడటానికి కారణమైందని చెబుతున్నారు. సాక్షాత్తు జగన్ కూడా క్రాస్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకోవడం వివేకా ఓటమికి మరో కారణమని అంటున్నారు.

మరోవైపు, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా ఎన్నికల ఇన్ ఛార్జ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించి పని చేశారు. వీరికి కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు అండగా నిలవడంతో... పార్టీ మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. ప్రణాళికలు రచించుకుని, పక్కాగా అమలు చేయడంతో, చివరకు వైసీపీకి పరాభవం తప్పలేదు. మరోవైపు, జడ్పీటీసీ సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికలకు ముందు నుంచే సమీకరణలు, శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాలలో ముఖ్యపాత్ర నిర్వహించారు. ఈ విధంగా ఎవరికి వారు... వారికి తోచిన మేర విజయంలో కీలక పాత్ర పోషించారు. వీటన్నింటి నేపథ్యంలో, తమ కంచుకోటలో వైసీపీ చతికిల పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.  

  • Loading...

More Telugu News