: ఆ ఇద్దరు సూఫీ మత గురువులు భారత్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నారు: సుబ్రహ్మణ్యస్వామి


పాకిస్థాన్‌ లోని కరాచీలో అదృశ్యమైన ఇద్దరు భారత సూఫీ మతగురువులపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ నుంచి సురక్షితంగా భారత్‌ చేరుకున్న ఆ ఇద్దరు సూఫీ మతగురువులు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాక్‌లో వారెలా అదృశ్యమయ్యారనే దానిపై మతగురువులు ఇంతవరకూ పెదవి విప్పడం లేదని ఆయన మండిపడ్డారు. వారిద్దరూ కిడ్నాప్ కు గురయ్యారని మీడియాలో కథనాలు వచ్చాయని, అయితే పాకిస్థాన్ ప్రభుత్వాన్ని విదేశాంగ శాఖ కోరగానే వారిద్దరూ ప్రత్యక్షమయ్యారని, అయితే వారిని ఎవరు అపహరించారు? ఎందుకు అపహరించారు? ఏం చేశారు? ఎక్కడ ఉంచారు? వారిని ఎవరు కాంటాక్ట్ చేశారు? ఎలా కాంటాక్ట్ చేశారు? అన్న వివరాలేవీ వెల్లడించలేదని ఆయన తెలిపారు.

కాగా, ఢిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ దర్గాకు చెందిన ప్రధాన గురువు సయ్యద్‌ ఆసిఫ్‌ నిజామీ, ఆయన బంధువు నజీం అలీ నిజామీ వారం కిందట పాక్‌ లో అదృశ్యమయ్యారు. వారిని కిడ్నాప్‌ చేసి ఉంటారని, పాక్‌ ఐఎస్‌ఐ వర్గాలు అదుపులోకి తీసుకున్నాయని పేర్కొంటూ వార్తాకథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అయితే పాక్‌ ప్రభుత్వంతో భారత అధికారులు సంప్రదింపులు జరిపి, వారిని క్షేమంగా స్వదేశానికి రప్పించారు. భారత్ చేరుకున్న వారిద్దరూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ను కలిసి, జరిగిన విషయాలపై వివరించారు.  

  • Loading...

More Telugu News