: ఈ విజయం అనైతికం... ఇదీ ఓ గెలుపేనా?: ఎన్నికల ఫలితాలపై జగన్
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడంపై వైకాపా అధినేత వైఎస్ జగన్ స్పందించారు. తమ ఓట్లన్నీ కొనుగోలు చేసిన చంద్రబాబు సాధించిన విజయం అనైతికమని, ఇదీ ఓ గెలుపేనా? అని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఓట్ల కొనుగోలు పథకంలో చంద్రబాబు ఆరితేరిపోయారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తే, అధికార బలంతో ఓట్లను కొనుగోలు చేశారని జగన్ ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని, తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయిన ఎంతో మంది ఎంపీటీసీలు, జడ్ పీటీసీలు తమ అభ్యర్థులకు ఓట్లు వేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి పూర్తి వ్యతిరేక ఫలితాలు వచ్చాయని కొన్ని చానళ్లు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని, కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన టీడీపీ, అతి కష్టం మీద విజయం సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవి నిజాయితీగా జరిగిన ఎన్నికలు కావని అన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసిన చంద్రబాబు, ఏపీలోనూ అదే పద్ధతిని అవలంబించారని ఆరోపించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ప్రజలే చరమగీతం పాడతారని అన్నారు.