: కంటెయినర్లలో రూ.వేల కోట్లు... చెన్నైలో ఉత్కంఠ!
పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి కంటెయినర్లలో భారీ ఎత్తున నకిలీ నోట్లు చెన్నై పోర్టుకు చేరుకున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రూ.వేల కోట్ల విలువైన రూ. 2వేల నకిలీ నోట్లతో ఉన్న కంటెయినర్లు హార్బర్‌కు చేరినట్టు అందిన సమాచారం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అధికారులు తనిఖీలు ముమ్మరం చేయడంతో తీరం వెంబడి కంటెయినర్ లారీలు పెద్ద ఎత్తున బారులు తీరాయి.
సముద్ర మార్గం ద్వారా పాక్, బంగ్లాదేశ్‌లు దేశంలోకి నకిలీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిఘావర్గాలకు సమాచారం అందింది. దీంతో దేశంలోని అన్ని హార్బర్లను అధికారులు అప్రమత్తం చేశారు. చడీచప్పుడు కాకుండా రెండు రోజులుగా అధికారులు కంటెయినర్లను తనిఖీ చేస్తున్నారు. మొదట్లో కొంతమంది అధికారులు మాత్రమే తనిఖీలు నిర్వహించగా ప్రస్తుతం భారీ ఎత్తున తనిఖీలు చేస్తుండడంతో ఏం జరుగుతుందో తెలియక ఉత్కంఠ నెలకొంది. కాగా, తీరం వెంబడి భారీగా కంటెయినర్ లారీలు నిలిచిపోవడంతో ఎగుమతి, దిగుమతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.