: గణనీయంగా తగ్గిన ఇన్వర్టర్ ఏసీల ధరలు!
తక్కువ కరెంటును వాడుకుంటూ, మరింత మెరుగ్గా పనిచేయడంతో పాటు పర్యావరణానికి స్నేహపూర్వకంగా ఉండే ఇన్వర్టర్ ఏసీల ధరలు గణనీయంగా తగ్గడంతో, ఈ సంవత్సరం కనీసం 25 శాతం మేరకు అమ్మకాలు పెరుగుతాయని ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. మూడు సంవత్సరాల క్రితం మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇన్వర్టర్ ఏసీల ధర రూ. 45 వేల నుంచి రూ. 65 వేల మధ్య ఉండగా, ఇప్పుడవే మోడల్స్ ధర రూ. 35 వేల నుంచి రూ. 45 వేలకు పడిపోయింది. ఎల్జీ వంటి పలు సంస్థలు, సాధారణ ఏసీల తయారీని పక్కనబెట్టి, ఇన్వర్టర్ ఏసీల తయారీలో నిమగ్నమయ్యాయి.
ఎయిర్ కండిషనింగ్ విభాగంలో ప్రధాన కంపెనీలుగా ఉన్న వోల్టాస్, బ్లూస్టర్, వర్ల్ పూల్, వీడియోకాన్, గోద్రేజ్, పానసోనిక్ వంటి కంపెనీలు సైతం ఈ తరహా ఏసీల తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇవి ఏసీ (ఆల్టర్నేటింగ్ కరెంట్)ని డీసీ (డైరెక్ట్ కరెంట్)గా మార్చుకుని పని చేస్తాయన్న సంగతి తెలిసిందే. ఇందువల్ల 25 నుంచి 30 శాతం వరకూ విద్యుత్ వాడకం తగ్గుతుందని కంపెనీలు చెబుతున్నాయి. ఇక వీటిల్లోనూ స్టార్ రేటింగ్ ను ఇవ్వడం ప్రారంభమైంది. 3 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీతో పోలిస్తే, 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ మెషీన్లు మరో 25 శాతం వరకూ తక్కువ విద్యుత్ ను వాడుకుంటాయి. ఆరంభంలో వీటికి ఎక్కువ ధరను చెల్లించాల్సి వున్నప్పటికీ, ఆపై తగ్గే కరెంటు బిల్లులు జేబుకు చిల్లు పెట్టబోవని నిపుణులు సైతం వీటినే సూచిస్తున్నారు.