: ‘మీరు గర్భవతా?’ అని అడిగినందుకు మండిపడ్డ విద్యాబాలన్!
‘మీరు గర్భవతా?’ అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నపై బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ మండిపడ్డారు. ఓ వివాహిత ఆసుపత్రికి వెళితే, ఆమె గర్భవతి అయినట్టుగా ఊహించేసుకుంటారని, తనకు మెుటిమలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి, ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి వెళ్లానని ఎందుకు అనుకోరు? అంటూ ఆమె ప్రశ్నించారు. అయినా, ఇది తన భర్తకు, తనకు సంబంధించిన వ్యక్తిగత విషయమని, మన దేశంలో రహస్యానికి చోటు ఉండదంటూ మండిపడ్డారు.
ఈ సందర్భంగా తనకు వివాహమైన రోజున జరిగిన ఓ సంఘటనను విద్యాబాలన్ ప్రస్తావించింది. ‘ఆ రోజు, మా అంకుల్ ఒకరు నా దగ్గరికి వచ్చి ‘మళ్లీ నిన్ను చూసినప్పుడు మీరు ముగ్గురుగా నాకు కన్పించాలి’ అని నాతో అన్నారు’ అని చెప్పింది. ‘అసలు ఈ పిల్లల గొడవ ఏంటి? నేను పిల్లల్ని కనే యంత్రాన్ని కాదు. ఇప్పటికే ప్రపంచ జనాభా పెరిగిపోతోంది. కొందరికి పిల్లలు లేకపోయినా పెద్ద నష్టమేమీ లేదు’ అంటూ ఆ ఇంటర్వ్యూలో ‘బేగం జాన్’ ఘాటుగా మాట్లాడింది.