: 'బాహుబలి ది బిగినింగ్' ఫ్లాప్ అయిందా?... నిర్మాత వ్యాఖ్యలపై టాలీవుడ్ లో చర్చ!
'బాహుబలి: ది బిగినింగ్' అట్టర్ ఫ్లాప్ అయిందా? అని టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. నిన్న 'బాహుబలి 2: ది కన్ క్లూజన్' సినిమా ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సినిమా నిర్మాత యార్లగడ్డ శోభు మాట్లాడుతూ, ‘‘బాహుబలి- ది బిగినింగ్' సినిమా విడుదలకు ముందు నేను పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. సినిమా కోసం భారీగా పెట్టుబడి పెట్టాం. కొత్త హద్దులను సృష్టించాం. కానీ, అంత మొత్తం తిరిగి రాబట్టుకోగలమా? అనే తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. మొదటి భాగానికి 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే...రెండో భాగానికి ఇంకా చాలా ఎక్కువ ఖర్చయింది. తొలి భాగానికి పెట్టిన ఖర్చుతో పోల్చుకుంటే మాకు వచ్చింది చాలా తక్కువ. లాభాలు అందుకోలేదు. ఆ లోటును 'బాహుబలి 2' భర్తీ చేస్తుందని భావిస్తున్నా’నని అన్నారు.
దీంతో టాలీవుడ్ లో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. గతంలో 'బాహుబలి' సినిమా 600 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సినీ ట్రేడ్ పండితులు పేర్కొన్న తెలిసిందే. దీంతో సౌతిండియా సినిమా భారీ విజయం సాధించిందని, భారతీయ సినీ పరిశ్రమ రికార్డులు బద్దలు కొట్టిందంటూ వార్తలు కూడా వెలువడ్డాయి. ఆ తరువాత 'బాహుబలి' టీమ్ కార్యాలయం, నివాసాలపై ఐటీ దాడులు కూడా జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని నిర్మాత చెబుతుండడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొంపదీసి 'బాహుబలి' అట్టర్ ఫ్లాప్ కాలేదు కదా? అన్న అనుమానం రేపుతోంది. దీంతో దీనిపై ఫిల్మ్ నగర్ లో పెద్ద చర్చే నడుస్తోంది.