: గోవాలో కాంగ్రెస్ కు షాకిచ్చిన మరో ఎమ్మెల్యే... పదవికి రాజీనామా
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన స్థాయిలో సీట్లు సంపాదించినప్పటికీ, ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇవ్వగా... తాజాగా మరో ఎమ్మెల్యే సావియో రోడ్రిగ్వెస్ ఇదే పనిచేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీని తమ నేతగా అంగీకరించలేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ బాధ్యత తీసుకోకపోవడంతో దిగ్విజయ్ సింగ్ ఓటమికి బాధ్యత వహించాల్సి ఉంటుందని రోడ్రిగ్వెస్ అన్నారు.
ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు సంపాదించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమవడాన్ని ఆయన ప్రస్తావించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వతంత్రులు, చిన్న పార్టీలకు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలు రాగా, బీజేపీకి 12, కాంగ్రెస్ కు 17 వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కూడగట్టడంలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే.
ఇక నిన్న జరిగిన విశ్వాస పరీక్షలో పారికర్ సర్కారు విజయం సాధించింది. బీజేపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు పొందినప్పటికీ ఇతరుల మద్దతు కూడగట్టడంలో విఫలం కావడంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. తొలుత ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే రాజీనామా చేస్తూ సీఎం పారికర్ కు మద్దతు ప్రకటించారు. మరింత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడాలనుకుంటున్నట్టు ఆయన చెప్పగా... తాజాగా రోడ్రెగ్వెస్ రాజీనామాతో అది వాస్తవమేనని తెలుస్తోంది.