: చనిపోయిన వ్యక్తికి వైద్యం చేస్తున్నట్లు నాటకమాడి.. రూ.6.5 లక్షల బిల్లు కట్టించుకున్న వైద్యులు
హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి సిటిజన్ ఆసుపత్రి వైద్యులు చనిపోయిన వ్యక్తికి వైద్యం చేస్తున్నట్లు నాటకమాడి అతడి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులాగారు. చివరికి విషయాన్ని గుర్తించిన మృతుడి బంధువులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌కు చెందిన 60 ఏళ్ల నాగభూషణరావు తీవ్ర అనారోగ్యం కారణంగా సదరు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
అయితే, అతడు చనిపోయిన విషయాన్ని అతడి కుటుంబసభ్యులకు చెప్పకుండా మరో 27 గంటలపాటు ఆయనకు వైద్యం చేస్తున్నట్లు నాటకమాడి రూ.6.5 లక్షల బిల్లు కట్టించుకున్నారు. అనంతరం తమకు ఏమీ తెలియనట్లు కుటుంబ సభ్యుల వద్దకు వచ్చి సదరు రోగి మృతి చెందినట్లు తెలిపారు. దీంతో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, డబ్బును మాత్రమే ఆశించి సరైన వైద్యం అందించలేదని అందుకే ఆయన ప్రాణాలు కోల్పోయాడని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.