: గుండె బద్దలైన తండ్రికి... ఏం ఫర్వాలేదంటూ ఆదుకుంది...సోషల్ మీడియాను ఆకట్టుకుంటున్న మహిళ దాతృత్వం


సాధారణంగా మనం ఏదైనా ప్రణాళిక వేసుకుని ముందుకు సాగితే... దానికి మధ్యలో ఏదైనా సమస్య ఏర్పడి మళ్లీ మొదటికే పరిస్థితి వస్తే తీవ్ర ఆవేదన కలుగుతుంది. అలాంటి ఆవేదనకు ఒక తండ్రి గురయ్యాడు. అతనికి అండగా నిలిచిన ఒక మహిళ దాతృత్వానికి నిదర్శనంగా నిలిచిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని నెబ్రాస్కా విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనను 'లవ్ వాట్ మేటర్స్' ఫేస్ బుక్ పేజ్ వెలుగులోకి తెచ్చింది.

నెబ్రాస్కా ఎయిర్ పోర్టులో విమానం ఎక్కేందుకు ఓ తండ్రి తన కుమార్తెతో కలిసి వచ్చాడు. చెక్ ఇన్ లోకి వెళ్లిన తరువాత సిబ్బంది కుమార్తె వయసును ప్రశ్నించడంతో ఆమెకు నెల క్రితమే రెండో ఏడాది వచ్చిందన్న విషయాన్ని  చెప్పాడు. మామూలుగా ఏడాది లోపు వయసున్న వారిని మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. దాంతో ఆయన సారీ చెప్పి, తన కుమార్తెను కూడా తనతో ప్రయాణించేందుకు అనుమతించాలని కోరాడు.

దీనికి ఎయిర్ పోర్టు చెక్ ఇన్ సిబ్బంది అంగీకరించలేదు. టికెట్ తీయాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో ప్రణాళిక ప్రకారం వెళ్తున్న ఆ వ్యక్తి టికెట్ కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం పక్కకి వెళ్లి, తెలిసిన వారికి ఫోన్ చేయడం ప్రారంభించాడు. ఇంతలో ఓ మహిళ అతనిని సమీపించి సమస్యను అడిగి తెలుసుకుంది. మళ్లీ ఆయన ఏదో చెప్పేంతలో కౌంటర్ వద్దకు వెళ్లి 749 డాలర్లు (భారత కరెన్సీలో రూ.49,160) పెట్టి టికెట్ కొని అతని చేతిలో పెట్టింది. ఆమెకు ధన్యవాదాలు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా... విమానం ఎక్కమని సూచించింది. టికెట్ డబ్బులు వాపస్ ఇస్తానని ఆ తండ్రి చెప్పగా... దాని గురించి ఆలోచించవద్దు.. క్షేమంగా వెళ్లండి అని సమాధానం ఇచ్చింది. ఈ ఘటన సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News