: మీరేమైపోతున్నారు, ఎక్కడికి పోతున్నారన్న బాధ, ఆవేదన నాకు కలుగుతున్నాయి!: ప్రతిపక్ష సభ్యులకు చంద్రబాబు చురకలు
ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత, పోలవరం ప్రాజెక్టుకి వంద శాతం నిధులు ఇస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. పలు వాస్తవాలు అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియాల్సి ఉందని అన్నారు. కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, నిర్మలా సీతారామన్, అశోక్ గజపతి రాజు, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పోలవరానికి రెండున్నరేళ్లలో 3,541 కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు పూర్తి చేయని ప్రాజెక్టులను తాము చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నామని అన్నారు. కాగా, మధ్యలో వైసీపీ నేతలు అడ్డుతగలగా వారు ఏమైపోతున్నారు? ఎక్కడికి పోతున్నారన్న బాధ, ఆవేదన తనకు కలుగుతున్నాయని చంద్రబాబు చురకలు అంటించారు. ప్రసంగం చేస్తోంటే పదే పదే అడ్డుతగులుతున్నారని అన్నారు. ఇంత దిగజారి పోయారని వ్యాఖ్యానించారు.
అనంతరం మళ్లీ చంద్రబాబు మాట్లాడుతూ నిన్న కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. తాము అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు విషయంపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడామని అన్నారు. తాము పోరాడి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయకపోతే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు సాధ్యం అయ్యేదా? అని ఆయన ప్రశ్నించారు.