: క్రికెటర్ సిద్ధూకు దక్కని పంజాబ్ ఉప ముఖ్యమంత్రి పదవి!
ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ పార్టీ సీనియర్ నేత, కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ముందు ఆ పార్టీలో చేరిన నవజ్యోత్ సింగ్ సిద్ధుకి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. ముఖ్యమంత్రితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన తొమ్మిదిమంది మంత్రుల్లో ఆయన ఉన్నారు. కానీ ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదు.
భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పిన సిద్ధూ అనంతరం కొత్త పార్టీ పెట్టడం, కొన్నాళ్లకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయన చేరతారని అనుకోవడం వంటి ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు కాంగ్రెస్ ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే, ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం గమనార్హం.