: ముస్లిం రిజర్వేషన్ల బిల్లు ఈ సమావేశాల్లోనే: కేసీఆర్
ముస్లిం రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లును సభలో తానే స్వయంగా ప్రవేశపెడతానని ఆయన చెప్పారు. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు. ఈ ఏడాది 201 ముస్లిం మైనారిటీ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ లో ఎక్కువగా ముస్లింలు ఉన్నారని అన్నారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 14వేల సీట్లకు గాను 4వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.
టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. 15 రోజుల వ్యవధిలోనే 3,500 సంస్థలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. మైక్రోమ్యాక్స్ సంస్థ ఉత్తరాఖండ్ లో ఉత్పత్తి ప్రారంభించడానికి రెండున్నరేళ్ల సమయం పడితే... తెలంగాణలో కేవలం మూడు నెలల కాలంలోనే ఉత్పత్తిని ప్రారంభించిందని అన్నారు.