: ఏపీ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం.. బడ్జెట్ లో ఇవి ఉండే అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ, వ్యవసాయ బడ్జెట్లను నేడు అసెంబ్లీ, శాసనమండలిలలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో, బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్ ఉండనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. రూ. లక్ష 56వేల కోట్లతో భారీ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్టు సమాచారం. ఈ బడ్జెట్ లో యువతకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. మహిళలు, ఈబీసీ, ఎంబీసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి గురించి ఈ బడ్జెట్ లో కొంత వరకు హైలైట్ చేయవచ్చని తెలుస్తోంది. రూ. 500 కోట్లను నిరుద్యోగభృతికి కేటాయించే అవకాశం ఉంది. దీంతోపాటు మరో రూ. 500 కోట్లను చంద్రన్న బీమాకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. కృష్ణ, పెన్నా నదుల అనుసంధానానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్ లో ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. ఇరిగేషన్ కు రూ. 12వేల కోట్లు కేటాయించనున్నారు.
10.25 గంటలకు అసెంబ్లీలో ఆర్థికమంత్రి యనమల బడ్జెట్ ను ప్రవేశపెడతారు. శాసనమండలిలో మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. ఆ తర్వాత 15 నిమిషాల అనంతరం వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెడతారు.