: రాంచీ టెస్టుకు ధోనీ దూరం... కుటుంబం హాజరు?
టెస్టుల నుంచి ఎప్పుడో తప్పుకున్న మాజీ కెప్టెన్ ధోనీ రాంచీ టెస్టులో ఎందుకు హాజరవుతాడన్న అనుమానం వచ్చిందా? ధోనీ ఈ టెస్టు మ్యాచ్ లో ఆడడం లేదు. సొంత మైదానమైన రాంచీలో టెస్టు జరగనున్న నేపధ్యంలో పిచ్ ను పరిశీలించిన ధోనీ మ్యాచ్ కు హాజరవుతాడంటూ ఊహాగానాలు వినిపించాయి. జార్ఖండ్ క్రికెట్ బోర్డు కూడా అందుకు చర్యలు చేపట్టేందుకు ఉపక్రమించింది. అయితే ప్రారంభ వేడుకలకు ధోనీ హాజరయ్యే దానిపై స్పష్టత రాలేదు.
దానికి కారణమేంటంటే... విజయ హాజారే ట్రోఫీలో భాగంగా బుధవారం విదర్భ-జార్ఖండ్ జట్ల మధ్య మూడో క్వార్టర్ ఫైనల్ ప్రారంభం కానుంది. జార్ఖండ్ జట్టు కెప్టెన్ గా ఈ మధ్యే పగ్గాలందుకున్న ధోనీ దిల్లీలో జరగనున్న ఈ మ్యాచ్ లో పాల్గొంటాడు. ఇందులో గెలిస్తే మార్చి 17న సెమీ ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాంచీ టెస్టుకు హాజరుపై ధోనీ స్పష్టత ఇవ్వలేదు. అయితే ధోనీ కుటుంబం మాత్రం ఈ మ్యాచ్ ను వీక్షిస్తారని జార్ఖండ్ క్రికెట్ బోర్డు చెబుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్టు చెబుతోంది. అలాగే ఈ మ్యాచ్ వీక్షణకు రోజూ పది వేల మంది విద్యార్థులకు పాస్ లు ఇచ్చినట్టు చెబుతోంది. ఈ మేరకు విద్యార్థులకు పాస్ లు అందజేశామని జార్ఖండ్ బోర్డ్ చెబుతోంది.