: కోహ్లీ కెప్టెన్సీ ఉక్కు పిడికిలి గల నియంత లాంటిది: ఆసీస్ ఆటగాడి హెచ్చరిక
ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య మూడో టెస్టు రాంచీలో ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు జట్లకు మాజీ ఆటగాళ్ల మద్దతు పెరుగుతోంది. ఆసీస్ మాజీ ఆటగాళ్లు కోహ్లీ దూకుడును ప్రశ్నిస్తుండగా, టీమిండియా వెటరన్ లు ఆసీస్ ఆటగాళ్లలాగే ప్రవర్తించాలని సూచిస్తున్నారు. ఈ వివాద నేపథ్యంలో ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పోరాట పటిమను ఉక్కు పిడికిలి గల నియంత వంటిదని కితాబునిచ్చాడు. రాంచీలో టీమిండియా దాడిని ఎదుర్కొనడానికి ఆస్ట్రేలియా రక్షణ కవచాలతో సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు.
ఒక ఓటమి తర్వాత కోహ్లీ జట్టు సభ్యులను నడిపించిన తీరుకు ఎవరైనా ఫిదా కావాల్సిందేనని వాట్సన్ అభినందించాడు. కోహ్లీ ఎంత నాణ్యమైన ఆటతీరును ప్రదర్శిస్తాడో... తన సహచరుల నుంచి కూడా అలాంటి ఆటతీరునే కోరుకుంటాడని అన్నాడు. ‘మెన్ ఇన్ బ్లూ’ అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తాడని సూచించాడు. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ కంటే కోహ్లీ ఉద్వేగపూరితమైన వ్యక్తి అని అన్నాడు. కాగా, గత ఐపీఎల్ లో కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడిన సంగతి తెలిసిందే.