: వియన్నా ఫస్ట్... బాగ్దాద్ లాస్ట్... అత్యుత్తమ నగరాల ర్యాంకులు!
ప్రపంచంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలు గల నగరాల జాబితాను మెర్సర్ అనే కన్సల్టింగ్ సంస్థ ప్రకటించింది. అత్యున్నత జీవన ప్రమాణాలు గల నగరాల జాబితాను తయారు చేసేందుకు ఈ సంస్థ 231 నగరాలను పరిశీలించింది. రాజకీయ సుస్థిరత, ఆరోగ్యం, రవాణా సౌకర్యాలు, విద్య, నేరాలకు సంబంధించిన గణాంకాలను పరిశీలించిన మీదట ఈ సంస్థ అత్యుత్తమ జీవన ప్రమాణాలు గల పట్టణాల జాబితాను రూపొందించింది.
ఈ జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా అగ్రస్థానంలో నిలవగా, బాగ్దాద్ చిట్ట చివరన నిలిచి అత్యంత చెత్త నగరంగా మరోమారు గుర్తింపు పొందింది. ఇక వియన్నా తర్వాతి స్థానాలను వరుసగా జ్యూరిచ్, ఆక్లాండ్, మ్యూనిచ్, వాంకోవర్ దక్కించుకున్నాయి. ఈ జాబితాలో ఆసియా నగరమైన సింగపూర్ 25వ స్థానాన్ని దక్కించుకోగా, ఆసియాలో అగ్రస్థానాన్ని సంపాదించడం విశేషం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో 29వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. లండన్, పారిస్, టోక్యో, న్యూయార్క్ నగరాలకు తొలి 30 స్థానాల్లో చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాగా, బాగ్దాద్ చిట్టచివరన నిలవడానికి కారణం ఐఎస్ఐఎస్ తీవ్రవాదులేనని ఈ సర్వే అభిప్రాయపడింది.