: మమ్మల్ని లైంగికంగా వేధించాడు: టీవీఎఫ్ చీఫ్ పై ఉద్యోగినుల ఆరోపణ
ఆన్ లైన్ ఎంటర్ టెయిన్ మెంట్ ఛానెల్ 'ది వైరల్ ఫీవర్' (టీవీఎఫ్) ఫౌండర్ సీఈఓ అరునబ్ కుమార్ పై ముగ్గురు ఉద్యోగినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తాను పని చేసిన రెండేళ్ల కాలంలో, ఎన్నోమార్లు ఆయన నుంచి వేధింపులను భరించానని, 'ఇండియన్ ఫౌలర్' అని నిక్ నేమ్ పెట్టుకున్న సదరు బాధితురాలు ‘ది ఇండియన్ ఉబెర్- దట్ ఈజ్ టీవీఎఫ్’ అనే పేరుతో సోషల్ మీడయాలో రాసిన కథనం ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను తొలిసారిగా 2014లో అరునబ్ ను ముంబైలోని ఓ కేఫ్ లో కలిశానని, ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతోనే కలసి పని చేద్దామన్న ఆయన ప్రతిపాదనకు అంగీకరించానని చెప్పారు.
ఆఫీసులో చేరిన తరువాత, మూడు వారాలకే అతనిలోని నిజస్వరూపం బయటపడిందని, చెప్పారు. అరునబ్ ను సోదరుడిగా భావించానని, తనకు పని చెబితే, చేసి వెళ్లిపోతానని వేడుకున్నా వినేవాడు కాదని వాపోయారు. పార్టీల్లో వికృత చేష్టలు చేసేవాడని, తాగి మీదపడిపోయేవాడని, ఆపై అది సర్వసాధారణంగా మారిపోయిందని, తన బాధను ఎవరికీ చెప్పుకోలేక పోయానని పేర్కొంది. పోలీసులకు చెబుతానంటే, వారంతా తన జేబుల్లోని వారని చెప్పేవాడని వెల్లడించింది. ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ కావడంతో మరో ఇద్దరు మహిళలు కూడా ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు. ఆయుషి అగర్వాల్, రీనా సేన్ గుప్తా లు టీవీఎఫ్ లో తాము లైంగికంగా వేధించబడ్డామని చెప్పారు. కాగా, టీవీఎఫ్ ఆమె ఆరోపణలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.