: దటీజ్ మోదీ ఎఫెక్ట్... ఒక్కసారిగా హైజంప్ చేసిన మార్కెట్ బుల్
శనివారం ఫలితాలు వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించడం, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఘన విజయం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచింది. ముందుగా ఊహించినట్టుగానే, మార్కెట్ బుల్ సెషన్ ఆరంభంలోనే హైజంప్ చేసింది. అన్నీ తానై ప్రచారాన్ని నడిపించి యూపీని దక్కించుకోవడంలో మోదీ కీలక పాత్ర పోషించగా, ఆపై ఉత్తరాఖండ్ ను సొంతం చేసుకోవడంతో పాటు గోవా, మణిపూర్ లలో సైతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కదులుతున్న నేపథ్యంలో ఈ ఉదయం ఈక్విటీల కొనుగోళ్లు వెల్లువెత్తాయి.
ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశవాళీ ఫండ్ సంస్థలు భారీగా పెట్టుబడులను స్టాక్ మార్కెట్ కు తరలించాయి. దీంతో, క్రితం ముగింపుతో పోలిస్తే, బీఎస్ఈ సెన్సెక్స్ సెషన్ ఆరంభమైన క్షణాల్లోనే 500 పాయింట్లు పెరిగింది. ఉదయం 10 గంటల సమయంలో బీఎస్ఈ సూచిక 477 పాయింట్లు పెరిగి 1.65 శాతం లాభంతో 29,423 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక, 138.65 పాయింట్లు పెరిగి 1.55 శాతం లాభంతో 9.073 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లోబోషెం, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఆటో మినహా మిగతా అన్ని కంపెనీలూ లాభాల్లో ఉండటం గమనార్హం.