: కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఈ ఏడాది చివర్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2017 చివరిలో కానీ, 2018 మొదట్లో కానీ ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ బి.వినోద్ కుమార్ మాత్రం ఈ ఊహాగానాలను కొట్టిపడేశారు. ముఖ్యమంత్రికి అటువంటి ఆలోచన ఏమీ లేదని తెలిపారు. 2019 ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, హామీ నెరవేర్చే వరకు ఆయన ఎన్నికలకు వెళ్లబోరని తెలిపారు.
మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మాత్రం తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్నారు. వచ్చే ఏడాది మొదట్లోనే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోవడం, కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో కేసీఆర్ దానిని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారని కృష్ణసాగర్ వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి మూడు కారణాలున్నాయని, ఒకటి.. రాష్ట్రంలో మరో రెండేళ్లలో బీజేపీ బలపడుతుందనే భయం, రెండు.. కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉండడం. చివరిది.. 2018లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనుండడం, ఈ ప్రభావం శాసనసభ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని.. కేసీఆర్ ముందస్తు ఆలోచనకు కారణమని ఆయన పేర్కొన్నారు.