: ఐఎస్‌ఐఎస్ భరతం పట్టడానికి.. కువైట్ కు 2500 మంది సైనికులను పంపిన డొనాల్డ్ ట్రంప్!
అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచే సమయంలో తానేవైతే హామీలిచ్చారో ఆ హామీలు నెరవేర్చే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పావులు కదుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని భూమిమీద లేకుండా చేస్తానని, ఉగ్రవాదంపై అవిశ్రాంత పోరాటం జరుగుతుందని చెప్పిన ట్రంప్ తొలిసారిగా... ఉగ్రవాదంపై పోరుకు సుమారు 2,500 మంది అమెరికా సైనికులను పంపారు. ఈ మేరకు కువైట్ లో సైన్యానికి సారథ్యం వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ జోసెఫ్ అండర్సన్ మాట్లాడుతూ, తూర్పు మధ్య ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు తమ బలగాలు తోడ్పాటునందిస్తాయని అన్నారు.
కువైట్ తో పాటు సిరియా, ఇరాక్ లలో ఐఎస్‌ఐఎస్ ముఖ్య స్థావరాలైన అల్ రఖా, మోసూల్ ప్రాంతాలలోని ప్రజలకు త్వరలోనే విముక్తి లభిస్తుందని చెప్పారు. ప్రజలకు ఉగ్రవాదుల చెరనుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కల్పించేందుకు తమ బలగాలు పనిచేస్తాయని ఆయన తెలిపారు. అలాగే శాంతి, సామరస్యం కోసం తమతో కలిసి వచ్చే ప్రతి దేశానికి సాదర స్వాగతం పలుకుతున్నామని ఆయన చెప్పారు.