: కేజ్రీవాల్ ఓ స్వార్థపరుడు.. అందుకే ఆయన పార్టీని ఓడించారు!: సిద్ధూ
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఓ స్వార్థపరుడని... అందుకే పంజాబ్ ఎన్నికల్లో ఓడిపోయాడని విమర్శించారు. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర కానుక అని అన్నారు. గత పదేళ్లుగా దగాపడ్డ పంజాబ్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు దుష్టులను ఓడించారని, చివరకు ధర్మమే గెలిచిందని చెప్పారు.
పంజాబ్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం వచ్చిందని సిద్ధూ అన్నారు. ఇక్కడి నుంచి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విస్తరిస్తుందని చెప్పారు. ఈ విజయానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, అమరీందర్ సింగ్ లే కారణమని తెలిపారు. అంతులేని గర్వంతో అకాలీదళ్ ఓటమిపాలైందని చెప్పారు. పంజాబ్ కు పునర్వైభవం తీసుకురావడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని సోనియాగాంధీకి గతంలో తాను చెప్పానని తెలిపారు.