: ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ముప్పు
ఎయిరిండియా విమానానికి పెను ముప్పు తప్పింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం మార్గం మధ్యంలో హంగేరి గగనతలంపై ఉండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన ఎయిరిండియా అధికారులు తమకు చెందిన బోయింగ్ 787-8 విమానాన్ని వెతికేందుకు హంగేరి ఫైటర్ జెట్స్ ను రంగంలోకి దింపారు. దీంతో ఎయిరిండియా బోయింగ్ విమానానికి దిశానిర్దేశం చేసేందుకు ఫైటర్ జెట్ దానిని చేరుకుంది. అయితే, అప్పటికే తిరిగి ఏటీసీతో విమానానికి సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో ఎయిరిండియా అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇంతలో ఎయిరిండియా విమానానికి రక్షణగా బెల్జియం ఎఫ్-16 వచ్చింది. అనంతరం లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో విమానం క్షేమంగా ల్యాండ్ అయింది. అనంతరం ఫ్రీక్వెన్సీలో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల ఏటీసీతో సంబంధాల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు.