: ఇప్పటికీ చంద్రుడి చుట్టూ చంద్రయాన్-1 తిరుగుతూనే వుంది!: నాసా ప్రకటన


చంద్రుడిపై పరిశోధనకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపించిన తొలి ఉపగ్రహం చంద్రయాన్-1 ఇప్పటికీ చంద్రుడి చుట్టూ తిరుగుతోందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) గుర్తించింది. 2008 అక్టోబర్ 22న చంద్రయాన్-1ను ఇస్రో ప్రయోగించింది. చంద్రుడి గురించి కీలకమైన సమాచారాన్ని సైతం ఈ ఉపగ్రహం అందించింది. సుమారు ఏడాది తర్వాత 2009 లో చంద్రయాన్-1తో ఇస్రోకు కమ్యూనికేషన్ తెగిపోయింది. అప్పటి నుంచి దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే అది ఎక్కడికి పోలేదని, చంద్రుని ఉపరితలానికి 200 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్నదని నాసా ఇంట‌ర్‌ప్లానెట‌రీ రాడార్ గుర్తించింది.

నాసాకు చెందిన లూనార్ రీకనాయిసెన్స్ ఆర్బిటర్ ను కూడా ఈ రాడర్ గుర్తించింది. ఏడేళ్ల కింద‌ట క‌మ్యూనికేష‌న్ తెగిపోయిన చంద్ర‌యాన్‌-1ను గుర్తించ‌డానికి కాస్త శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ని నాసాలోని జెట్ ప్ర‌ప‌ల్ష‌న్ లేబొరేట‌రీ రాడార్ సైంటిస్ట్ మ‌రీనా బ్రోజోవిక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. చంద్రుని వెలుతురులో చిన్న‌చిన్న వ‌స్తువుల‌ను ఆప్టిక‌ల్ టెలిస్కోపులు గుర్తించ‌లేవని... కొత్త‌గా వ‌చ్చిన ఇంట‌ర్‌ప్లానెట‌రీ రాడార్ అనే అప్లికేష‌న్ ద్వారా ఈ స్పేస్‌క్రాఫ్ట్స్‌ను గుర్తించడం సాధ్య‌మైందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భ‌విష్య‌త్తులో చంద్రునిపైకి స్పేస్‌క్రాఫ్ట్‌ల‌ను పంపేవారికి ఈ కొత్త టెక్నాల‌జీ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వారు అన్నారు.

  • Loading...

More Telugu News