: మా నాన్న ఏం తప్పు చేశారు? ఎందుకు చంపారు?: ప్లకార్డులు పట్టుకొని ప్రశ్నిస్తున్న బాలిక వీడియో
కార్గిల్ యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందిన ఓ జవాను కూతురు గుర్మెహర్ కౌర్ సోషల్ మీడియాలో చేసిన ‘మా నాన్నను పాకిస్థాన్ చంపలేదు.. యుద్ధం చంపింది’ అనే పోస్టు దేశ వ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే, అదే తరహాలో ప్లకార్డు పట్టుకొని ఓ ఎనిమిదో తరగతి బాలిక తాజాగా తన నాన్నను అన్యాయంగా చంపారని పోస్టు చేసింది. కేరళకి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంతోష్ కుమార్ రెండు నెలల క్రితం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సంతోష్‌కు పన్నెండేళ్ల విస్మయ అనే కూతురు ఉంది. ఆమె చూస్తుండగానే ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు సంతోష్‌ను చంపారు. దీంతో తాజాగా ఆమె తనకు న్యాయం కావాలంటూ ఇలా సోషల్ మీడియాలో ప్లకార్డులు పట్టుకొని పోస్టు చేసింది.
తన తండ్రి తన కలలు నెరవేర్చాలనుకున్నారని విస్మయ పేర్కొంది. తాను పెద్దయ్యాక ఐపీఎస్ అధికారినై పేద ప్రజలకు సాయం చేయాలనుకున్నానని చెప్పింది. కానీ, తన తండ్రి మరణంతో తన లక్ష్యం తుడిచిపెట్టుకుపోయిందని పేర్కొంది. ఆర్ఎస్ఎస్, బీజేపీలకు మద్దతు తెలపడమే తన తండ్రి చేసిన తప్పా? అని నిలదీస్తోంది. ఇప్పుడు తన భవిష్యత్ అంతా చీకటిమయమైందని ఆవేదన చెందుతోంది. వారు తన నాన్నని మాత్రమే చంపలేదని, తన ఆశలు, లక్ష్యాలను కూడా చంపేశారని చెప్పింది. అసలు తన తండ్రిని దుండగులు ఎందుకు చంపాల్సి వచ్చిందన్న ప్రశ్నకు తనకు ఇప్పటికీ సమాధానం దొరకలేదని పేర్కొంది. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
Vismaya, Daughter of Santoshkumar, says "They murdered not just my dad, but my dreams and future" pic.twitter.com/UJwVo2ppME
— J Nandakumar (@kumarnandaj) March 8, 2017