: దేవుళ్లకు కానుకలిచ్చే కేసీఆర్ కు... మహిళలకు పెన్షన్ ఇవ్వాలని తెలియదా?: సీపీఎం నేత బృందా కారత్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఎం జాతీయ నాయకురాలు బృందా కారత్ తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తిగత నమ్మకాల కోసం ప్రజా ధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దేవుళ్లకు అత్యంత ఖరీదైన కానుకలిచ్చే కేసీఆర్ కు... మహిళలకు పెన్షన్ ఇవ్వాలనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ లో కూడా మహిళలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. ప్రధాని మోదీ ఆచరిస్తున్న విధానాలు మహిళల అభ్యున్నతికి వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ మద్యపానాన్ని ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ వారిని ఈ దేశం ఎన్నడూ జాతీయ వాదులుగా గుర్తించదని ఆమె అన్నారు. మహిళల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆమె పైవ్యాఖ్యలు చేశారు.