: ఒకప్పుడు మన సమాజంలో స్త్రీలకి ఎంతో విలువ ఉండేది.. క్రమంగా క్షీణించిపోయింది: పవన్ కల్యాణ్
మహిళా దినోత్సవం సందర్భంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు తమ పార్టీ నుంచి ప్రెస్‌నోట్ విడుదల చేశారు. అందులో మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ.. స్త్రీలను అందరూ గౌరవించాలని అన్నారు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత (ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు) అనే ఆర్యోక్తిని ఉటంకించారు. ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో వారికి పూజలు చేయకపోయినా వారేమీ బాధపడరని, వారికి కనీస గౌరవం ఇవ్వనప్పుడే బాధపడుతారని ఆయన అన్నారు.
సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు, వారు నిర్భయంగా తిరగలేనప్పుడు మన ఆడపడుచులు తీవ్రంగా వ్యధ చెందుతారని పవన్ కల్యాణ్ అన్నారు. ఒకప్పుడు భారతీయ సమాజాంలో స్త్రీకి ఎంతో విలువ ఉండేదని, అది క్రమంగా క్షీణించిపోయిందని పేర్కొన్నారు. ఆ ప్రాభవాన్ని మనమందరం పునరుజ్జీవింప చేద్దాం అని అన్నారు. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్ర్యం వస్తుందన్న బాపు మాటలను నిజం చేద్దామని పేర్కొన్నారు. మహిళ దినోత్సవాలను మాటలతో చేయడం కాదు.. చేతలతో చూపుదామని అన్నారు.