: మరి కొన్ని గంటల్లో ఇంటర్ పరీక్ష... రోడ్లపై వికృత చేష్టలకు పాల్పడుతూ పట్టుబడ్డ హైదరాబాద్ కుర్రాళ్లు
చదివేది ఇంటర్మీడియట్.. చేసేది రాత్రంతా తాగడం.. బైకులపై తిరుగుతూ రోడ్డుపై వెళుతున్న వారిని తిట్టడం, కొట్టడం. హైదరాబాద్ పాతబస్తీలోని కొందరు విద్యార్థుల దినచర్య ఇది. వారికి అడ్డుకట్ట వేసేందుకు ఈ రోజు తెల్లవారు జామున పాతబస్తీలో పోలీసులు చబుత్రా మిషన్ ఆపరేషన్‌ను చేపట్టి అక్కడి శాలిబండ, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట పరిధిలో తనిఖీలు నిర్వహించారు. శాలిబండలో 30, చంద్రాయణగుట్టలో 22, ఫలక్‌నుమాలో 8 మంది యువకులు ఆ సమయంలో విచ్చలవిడిగా బైకులపై తిరుగుతూ, తాగి తందనాలాడుతూ పట్టుబడ్డారు.
వీరంతా మరికొన్ని గంటల్లో ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉంది. అయినప్పటికీ ఉదయం 3 వరకు ఇలా రోడ్లపైనే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. యువతుల్ని వెంబడిస్తూ దాడులు కూడా చేస్తున్నారు. ఇంటర్ పరీక్షల దృష్ట్యా ఆ విద్యార్థులను వెంటనే విడిచిపెట్టి, మళ్లీ పరీక్ష అయిపోయాక రమ్మన్నారు. వారి బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ 60 మందికి వారి తల్లిదండ్రుల సమక్షంలో ఫలక్ నుమా మొగల్ ఫంక్షన్ హాల్లో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మరికాసేపట్లో కౌన్సెలింగ్ ఇస్తారు.