: తుందుర్రులో తీవ్ర ఉద్రిక్తత.. వందలాది మంది అరెస్ట్!
పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ నిర్మిస్తోన్న ఆక్వాఫుడ్ పార్క్ వల్ల తమకు ముప్పు కలుగుతుందని తుందుర్రు గ్రామస్థులతో పాటు ఆ ప్రాంతం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ రోజు ఆందోళన చేపట్టారు. అయితే, నిన్ననే ఆ ప్రాంతానికి చేరుకున్న 1100 మంది పోలీసులు ఆందోళనలు చెలరేగకుండా 144 సెక్షన్ విధించారు. ఆక్వాఫుడ్ బాధితులకు ప్రజాసంఘాలు, వామపక్షాలు, వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపాయి. తుందుర్రులో ఆందోళనకారులని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వామపక్ష, వైసీపీ నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. ఆందోళనకారుల నినాదాలు, అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. వందలాది మంది ఒకేసారి రోడ్లపైకి వచ్చే ప్రయత్నం చేయడంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు వందల మందిని అదుపులోకి తీసుకున్నారు.