: మోదీ బీహార్ కి ప్రకటించిన భారీ ప్యాకేజీలో ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రకటించిన నిధుల్లో ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట. సమాచార హక్కు చట్టం కింద 2016 డిసెంబరులో ముంబైకి చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అనిల్ గోల్గాలి ఈ అంశంపై ఆరా తీయగా తాజాగా ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆనంద్ పర్మార్ స్పందించారు.
బీహార్‌కు ప్రకటించిన ప్యాకేజీ నిధులు విడుదల చేయకపోయినప్పటికీ ఆ రాష్ట్రంలో ప్రాజెక్టులు, ఇతర పనులు దశల వారీగా పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమాధానంపై అనిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్యాకేజీ ప్రకటించి ఏడాదిన్నర అయినా కాసింతయినా నిధులు ఇవ్వలేదని అన్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు రూ.80 వేల కోట్ల ప్యాకేజీ, సిక్కింకు రూ.43 వేల కోట్ల ప్యాకేజీ కూడా ప్రకటించిందని, వాటి విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉందని అనిల్ తెలిపారు.