: బీకాంలో ఫిజిక్స్ చదివిన వారికి నా లెక్కలు అర్థం కావు: అసెంబ్లీలో జగన్ చురకలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటోందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. మన ప్రభుత్వం ఎంతగా గొప్పలు చెప్పుకుంటుందంటే జీడీపీ వృద్ధి రేటు ఏకంగా 10.99 అని చెప్పుకుంటోందని అన్నారు. చెన్నయ్ రాజధానిగా వున్న మన పక్క రాష్ట్రం తమిళనాడులో 2015-16 సంత్సరానికి వృద్ధిరేటు 8.79, బెంగళూరు ఉన్న కర్ణాటకలో 6.2, ముంబయి రాజధానిగా ఉన్న మహారాష్ట్ర లో 8 శాతం, మోదీ సొంత రాష్ట్రం గుజారాత్ లో కూడా 7.7 శాతం వృద్ధి రేటు ఉందని జగన్ అన్నారు.
కాగా, చంద్రబాబు నాయుడు మాత్రం మన రాష్ట్ర వృద్ధిరేటు ఏకంగా 10.99 అని చెబుతున్నారని ఆయన అన్నారు. ఆహా.. వారెవ్వా చంద్రబాబు నాయుడు ఏ విధంగా గొప్పలు చెప్పుకుంటున్నారో అర్థం చేసుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు. సభలో వైఎస్ జగన్ ఇటువంటి లెక్కలు చెబుతూ ప్రసంగం కొనసాగిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అడ్డుతగలడంతో ఆయనను ఎద్దేవా చేస్తూ జగన్ మాట్లాడారు. బీకాంలో ఫిజిక్స్ చదివిన వారికి తన లెక్కలు అర్థం కావని చమత్కరించారు.