: మలేషియన్లపై కఠిన ఆంక్షలు... దేశం విడిచి పెట్టేందుకు వీలులేదంటూ ఉత్తర కొరియా నియంత ఆదేశాలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సవతి తల్లి కొడుకు కిమ్ జోంగ్ నామ్, మలేషియాలో దారుణ హత్యకు గురైన తరువాత, ఇరు దేశాల మధ్యా విభేదాలు ఏర్పడగా, వాటిని మరింతగా పెంచుతూ, తమ దేశంలో ఉన్న మలేషియా దౌత్యాధికారులు సహా, ఏ మలేషియన్ కూడా దేశం దాటి వెళ్లకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. నామ్ మృతదేహానికి పోస్టుమార్టం చేయడం, దాన్ని తమకు అప్పగించడంలో కాలయాపన చేస్తుండటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఉత్తర కొరియా నియంత, ఈ మేరకు మలేషియన్లపై తాత్కాలిక నిషేధాన్ని విధిస్తున్నట్టు ప్రకటించారు. మలేషియాలో ఉన్న తమ పౌరులు, దౌత్యవేత్తల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా ఉత్తర కొరియా చెబుతుండటం గమనార్హం. సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుందని భావిస్తున్నట్టు ఆ దేశ అధికారులు తెలిపారు.