: క్రికెట్ ను మ్యాథ్స్ తో పోల్చిన సెహ్వాగ్ ఆసక్తికర ట్వీట్!
టీమిండియా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ లో మరోసారి ఆసక్తికర ట్వీట్ చేసి అభిమానులను అలరించాడు. బోర్డర్ అండ్ గవాస్కర్ పేటీఎం ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య ఎంతో ఉత్కంఠగా జరుగుతాయని భావించిన టెస్టు మ్యాచ్ లలో భారత జట్టు పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ తన ట్విట్టర్ పేజీలో అంతర్జాతీయంగా పాప్యులర్ అయిన ఓ మోటివేషనల్ (స్ఫూర్తిమంతమైన) కోట్ ను పేర్కొన్నాడు.
0.99 శాతం పనితో 365 రోజులూ కష్టపడ్డా అనుకున్నది సాధించలేమని, మన ప్రయత్నాన్ని కాస్త పెంచి 1.01 శాతం కృషి పెట్టగలిగితే సాధించవలసిన దానికన్నా ఎంతో ఎక్కువ సాధించగలుగుతామని, విజయ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని పేర్కొనే గణిత సూత్రాన్ని ఈ మోటివేషనల్ పోస్టర్ మనకు వివరిస్తుంది.
బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో పేలవ ప్రదర్శనతో భారత జట్టు కేవలం 189 పరుగులు చేసిన సంగతి తెలిసిందే... ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 276 పరుగులు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ రెండు ప్రదర్శనల మధ్యనున్న తేడాను ఎత్తి చూపిన సెహ్వాగ్... భారత్ సాధించాల్సింది ఎంతో గుర్తు చేశాడు. ఈ ట్వీట్ తో సెహ్వాగ్ ఇంటలెక్చువల్ అంటూ అతని అభిమానులు సంబరపడిపోతున్నారు.