: జయలలిత చికిత్సపై ఎయిమ్స్ వైద్యుల నివేదికను విడుదల చేసిన తమిళనాడు ప్రభుత్వం!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో అందించిన చికిత్సపై ఎయిమ్స్ వైద్యులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక వివరాలను తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. గత సెప్టెంబర్ 22న రాత్రి 10 గంటలకు అప్పటి ముఖ్యమంత్రి జయలలితను అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలిపారు. జయలలిత శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఆసుపత్రికి రాగానే ఆమెకు పలు పరీక్షలు నిర్వహించామని వైద్యులు ఈ రిపోర్టులో తెలిపారు.
ఆ పరీక్షల్లో జయలలితకు డీహైడ్రేషన్ తోపాటు ఇన్ ఫెక్షన్, శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడ్డాయని గుర్తించారు. దీంతో ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం చికిత్స అందించింది. ప్రభుత్వం కోరిక మేరకే ఎయిమ్స్ నుంచి వైద్య బృందం జయలలితకు చికిత్సనందించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిందని ఈ నివేదిక తెలిపింది. కొందరు నేతలు, పార్టీలు ఆరోపిస్తున్నట్టుగా ఆసుపత్రిలో జయలలితపై ఎలాంటి కుట్ర జరగలేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. మద్రాసు హైకోర్టుకు కూడా ఇదే నివేదికను తమిళనాడు ప్రభుత్వం అందించనుంది.
72 రోజుల సుదీర్ఘ చికిత్స అనంతరం గుండెపోటు రావడంతో జయలలిత మృతి చెందారని తమిళనాడు సర్కారు ప్రజలకు విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఎక్మో సపోర్ట్ సిస్టమ్ ను అందించినా జయలలితను కాపాడుకోలేకపోయినట్టు నివేదిక పేర్కొంది. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటు అన్నాడీఎంకే సీనియర్ నేతలకు కూడా తెలిపినట్టు నివేదిక వెల్లడించింది.
కాగా, జయలలిత మృతిపై సీబీఐ విచారణను డిమాండ్ చేస్తూ పన్నీరు సెల్వం ఆమరణ నిరాహారదీక్షకు దిగనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దీక్షకు ముందుగానే ఎయిమ్స్ వైద్యుల నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేసింది. అయితే చికిత్స జరుగుతున్న సమయంలో జయలలిత దగ్గరకి ఇతర ప్రముఖులను ఎవర్నీ ఎందుకు అనుమతించలేదన్న దానికి మాత్రం సమాధానం చెప్పకపోవడం విశేషం.