: డాక్టర్ బతిమాలినా జగన్ వినలేదు.. నందిగామ ‘వివాదం’పై ఎస్పీ వివరణ
గత నెల 28న కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై కృష్ణా జిల్లా ఎస్పీ విజయకుమార్ వివరణ ఇచ్చారు. బస్సు ఒడిశాలోని కటక్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్, క్లీనర్ సహా మొత్తం పదిమంది చనిపోయినట్టు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ ఆదినారాయణ మద్యం మత్తులో ఉన్నాడో లేదో తెలుసుకునేందుకు ఆయన శరీర భాగాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్టు తెలిపారు. ఛిద్రమైన ఆయన మృతదేహాన్ని చాపలో చుట్టి పోస్టుమార్టం కోసం తరలించాల్సి వచ్చిందన్నారు.
మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాల్సిందిగా ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని డాక్టర్ శ్రీనునాయక్ చేతిలోంచి వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి లాక్కున్నారని, వైద్యుడు బతిమాలినా జగన్ పట్టించుకోలేదన్నారు. అది పోస్టుమార్టం రిపోర్టు కాదని శ్రీనునాయక్ చెబుతున్నా జగన్ వినిపించుకోలేదన్నారు. ప్రతిపక్ష నాయకుడినైన తనకు ఓ కాపీ ఇవ్వాలంటూ ఆయనను జగన్ గద్దించారని తెలిపారు. పోస్టుమార్టం గదిలోనే జగన్ మీడియా సమావేశం పెట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. అది సరికాదన్న కలెక్టర్‌పై జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని ఎస్పీ వివరించారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ప్రత్యేక వాహనాల్లో తరలిస్తుండగా వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఎస్పీ తెలిపారు. జగన్ వస్తున్నారని, మృతదేహాలను అక్కడే ఉంచాలంటూ పట్టుబట్టారని పేర్కొన్నారు. తాను, కలెక్టర్ ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వచ్చిన జగన్.. మృతదేహాలు ఉంచిన గదిలోకి వెళ్లారని తెలిపారు. అప్పటికే తొమ్మిది మృతదేహాలలో ఎనిమిదింటికి పోస్టుమార్టం పూర్తయిందని, డ్రైవర్ మృతదేహం ఛిద్రమై ఉండడంతో బస్సులోంచి తీయడం ఆలస్యమైందని, అందుకే చివరగా పోస్టుమార్టం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీనిపైనే జగన్ రాద్ధాంతం చేశారని ఎస్పీ విజయకుమార్ వివరించారు.