: స్నేహితుడని నమ్మి పర్శనల్ వీడియోలు పంపితే పోర్న్ సైట్లో పెట్టిన కీచకుడు!
స్నేహితుడు, కోరుకున్నవాడేకదా అని నమ్మి వీడియోలు పంపితే, వాటిని అశ్లీల వెబ్ సైట్లో ఉంచి తన అసలు రూపాన్ని చూపించాడో కీచకుడు. సైబరాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, చిత్తూరుకు చెందిన నవీన్ కుమార్, బాధిత యువతిని ప్రేమించాలని కోరుతూ వెంటపడుతుండేవాడు. విషయం అమ్మాయి ఇంట్లో తెలిసి మందలించడంతో, కొంత కాలం మౌనంగా ఉండి, ఆపై తిరిగి స్నేహమంటూ, అమ్మాయిని వల్లో వేసుకున్నాడు. నగ్న దృశ్యాలు, వీడియోలను పంపాలని కోరితే, నమ్మిన బాధితురాలు వాటిని పంపింది.
దీన్ని అలుసుగా తీసుకున్న నవీన్, తన కోరికలు తీర్చాలని వేధింపులు మొదలు పెట్టాడు. అది తీరక, ఆ చిత్రాలను, వీడియోలను పోర్న్ సైటులో పెట్టి ఆ లింకులను అమ్మాయికి పంపాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు తన దగ్గరి బంధువైన దిలీప్ కు విషయం చెప్పడంతో, ఆదుకోవాల్సిన దిలీప్ కూడా అదే పని చేశాడు. ఆ వీడియోలను మరిన్ని సైట్లలో పెట్టాడు. దీంతో యువతి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. బంధువైన దిలీప్ ను అరెస్ట్ చేశామని, ప్రధాన నిందితుడైన నవీన్ కుమార్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అమ్మాయిలు తమ వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను ఎవరితోనూ పంచుకోవద్దని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.