: ఒకే గ్రామంలో.. ఒకే ముహూర్తంలో.. ఒకే కులంలో వంద వివాహాలు!
టీటీడీ లాంటి సంస్థలు నిర్వహించే సామూహిక వివాహాల సందర్భంగా ఒకే వేదికపై వంద వివాహాలు జరగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే ఒకే ఊర్లో ఒకే ముహూర్తంలో వంద వివాహాలు జరగడం కాస్త ఆశ్చర్యకరమే... అలాంటిది ఒకే ఊర్లో ఒకే ముహూర్తంలో ఒకే కులంలో వంద వివాహాలు జరగనుండడం ఇప్పుడు విశేషం అయింది. శ్రీకాకుళం జిల్లాలో ఇలా ఈ నెల 5వ తేదీన వంద వివాహాలు జరగనున్నాయి. వజ్రపుకొత్తూరు మండలంలోని సుమారు 12 వేల జనాభా కలిగిన నువ్వలరేవు గ్రామంలో కేవిటి కులస్తులు అధికంగా ఉన్నారు. ఈ గ్రామానికి చెందిన వంద మందికి వివాహం ఈనెల 5న నిర్వహించారు. అయితే ఈ వివాహ వేడుకలు కేవలం ఒక్కరోజు కాకుండా మూడు రోజులపాటు నిర్వహించనున్నారు.
ఈ గ్రామంలో బెహర, బైనపల్లి, మువ్వల ఇంటి పేర్లు కలవారు మాత్రమే ఉన్నారు. ఇందులో ఏ ఇంటి పేరున్నవారు ఆ ఇంటి పేరువారితో కాకుండా మిగిలిన రెండు ఇంటి పేర్ల వారిలో ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ గ్రామంలో అమ్మాయిలను ఇతర ప్రాంతాలకు చెందిన యువకులకు ఇవ్వరు. వరులకు మాత్రం ఒడిశాలోని సుగండి గ్రామాల్లో గల తమ కులానికి చెందిన యువతులతో సంబంధం కుదుర్చుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5న రాత్రి 11:31 నిమిషాలకు వంద వివాహాలు జరగనున్నాయి. 6న ఒకే సమయానికి ఈ జంటలన్నింటినీ ఏకాంతానికి వదిలేసే ముహూర్తం పెట్టడం మరో విశేషం. ఈ సందర్భంగా బాల్యవివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవడం ఇక్కడ ప్రత్యేకత. మూడేళ్లకోసారి ఇక్కడ వివాహాలు జరిపిస్తారు. 2014లో గతంలో 200 జంటలకు ఈ గ్రామంలో వివాహాలు చేయడం విశేషం.