: డబ్బులు లేని వారికి కూడా ఆహారం పెట్టిన గొప్ప వ్యక్తి పటేల్: స్థానిక అమెరికన్లు
సౌత్ కరోలినా లోని లాంకాస్టర్ కౌంటీలో ఉంటున్న భారతీయ వ్యాపారవేత్త హర్నీష్ పటేల్ ను ఆయన నివాసం ఎదుటే కాల్చి చంపారు. ఆ సమయంలో ఆయన భార్య, ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్న కుమారుడు ఇంట్లోనే ఉన్నారు. గురువారం రాత్రి 11.24 గంటలకు పటేల్ తన షాప్ ను క్లోజ్ చేశాడు. ఈ షాప్ అతని ఇంటికి దగ్గర్లోనే ఉంది. పది నిమిషాల తర్వాత తన ఇంటికి చేరుకున్న అతన్ని... ఇంటి ముందు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన పట్ల కౌంటీలో ఉన్న ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పటేల్ చాలా మంచి వ్యక్తి అని... ఈ ప్రాంతంలో గౌరవం కలిగిన వ్యక్తి అని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఈ హత్య జాత్యహంకార నేపథ్యంలో జరిగింది కాకపోవచ్చని పోలీసులు తెలిపారు.
పటేల్ మృతికి స్థానికులు ఘన నివాళి అర్పించారు. అతని షాప్ వద్ద బెలూన్లు, పువ్వులను ఉంచి సంతాపం ప్రకటించారు. అంతేకాదు, "కుటుంబ పరిణామాల నేపథ్యంలో కొన్ని రోజుల పాటు స్టోర్ మూసివేయబడింది. అసౌకర్యానికి చింతిస్తున్నాం" అంటూ రాసిన ఓ షీట్ ను స్టోర్ డోర్ మీద అతికించారు.
పటేల్ షాప్ కు రెగ్యులర్ కస్టమర్ అయిన నికోల్ జోన్స్ మాట్లాడుతూ, డబ్బు లేని వారికి కూడా పటేల్ ఆహారాన్ని ఇచ్చేవాడని చెప్పింది. ఇంత మంచి వ్యక్తిని ఎవరు చంపి ఉంటారన్న విషయం అర్థం కావడం లేదని ఆమె కన్నీటి పర్యంతం అయింది.