: ఆ రోజే నా రిటైర్మెంట్ ఆలోచనలకి బీజం పడింది: సచిన్ టెండూల్కర్
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తాను క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడానికి కారణాలను మరోసారి గుర్తుచేసుకున్నాడు. లింక్డ్ ఇన్ లో జాయిన్ అయిన సందర్భంగా సచిన్ తన అనుభవాలను అభిమానులకు వివరించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే... 2013 అక్టోబర్ లో ఛాంపియన్స్ లీగ్ ఆడుతున్న సమయంలో జిమ్ కు వెళ్లేందుకు తన శరీరం ఏమాత్రం సహకరించలేదని, నిద్ర లేచేందుకు శరీరం మొరాయించిందని తెలిపాడు. తన సుదీర్ఘ కెరీర్ లో అలాంటి అనుభవాలెప్పుడూ లేవని అన్నారు. దీంతో బలవంతాన కళ్లు తెరిచి జిమ్ కు వెళ్లానని, అక్కడ కూడా శరీరం ప్రాక్టీస్ కు ఏమాత్రం సహకరించలేదని గుర్తుచేసుకున్నాడు.
దీంతో రిటైర్మెంట్ కు దగ్గరవుతున్నానని తొలిసారి అనిపించిందని సచిన్ తెలిపాడు. తరువాత మ్యాచ్ లంచ్, టీ విరామ సమయాల్లో రిఫ్రెష్ అయ్యేందుకు తనకు ఎంత సమయం సరిగ్గా సరిపోతుందో లెక్కలేయడం ఆరంభించానని తెలిపాడు. ఈ సమయంలో ప్రముఖ క్రీడాకారిణి బిల్లీ జీన్ కింగ్ చెప్పిన "నువ్వెప్పుడు విరామం తీసుకోవాలో ప్రపంచం నిర్ణయించకూడదు...ఆ నిర్ణయాన్ని నువ్వే తీసుకోవాలి" అన్న మాటలు గుర్తు చేసుకున్నానని తెలిపారు. ఆ తరువాత సరిగ్గా నెల రోజులకు తన రిటైర్మెంట్ ప్రకటించానని సచిన్ తెలిపాడు. 14 నవంబర్ 2013లో సచిన్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.