: నెల్లూరు నుంచి పాదయాత్రగా పవన్ కల్యాణ్ వద్దకు వచ్చిన విద్యార్థులు.. సమస్యలు విని చలించిన జనసేనాని
నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో చోటు చేసుకుంటున్న అక్రమాలు, ఇబ్బందులపై కొన్ని రోజులుగా విద్యార్థులు తమ నిరసనలను తెలుపుతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడంపై వర్సిటీ విద్యార్థులు నెల్లూరు నుంచి హైదరాబాద్‌కి పాదయాత్రగా వచ్చారు. నగరంలోని రామోజీ ఫిల్మ్‌సిటీలో కాటమరాయుడు షూటింగ్ లొకేషన్‌లో ఉన్న సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసిన విద్యార్థులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. వర్సిటీలో జరుగుతోన్న అక్రమాలపై ప్రభుత్వం స్పందించట్లేదని వారు అన్నారు. కాలినడకన హైదరాబాద్ బయలుదేరిన విద్యార్థుల్లో కొందరు విజయవాడలో అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.
విద్యార్థుల సమస్యలను విన్న పవన్ కల్యాణ్ చలించిపోయారు. విజయవాడలో మిగిలిపోయిన విద్యార్థులు కూడా హైదరాబాద్ రావాల్సిందిగా పవన్ సూచించారు. సదరు యూనివర్సిటీలోని సమస్యలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని సర్కారుని ఆయన కోరారు. వర్సిటీ సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని చెప్పారు.