: కాశ్మీరుకు స్వాతంత్ర్యం కావాలి.. 'జేఎన్యూ'లో మొదలైన సరికొత్త రగడ!
ఇప్పటికే పలు మార్లు వివాదాస్పదమై, జాతి విద్రోహులకు నిలయమైందని చెడ్డ పేరు తెచ్చుకున్న ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఇప్పుడు మరో రగడ మొదలైంది. వర్శిటీలోని స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కొత్త బ్లాక్ గోడలపై కాశ్మీర్ కు స్వాతంత్ర్యం కావాలంటూ ముద్రించిన పోస్టర్లను కొందరు గుర్తు తెలియని విద్యార్థులు అంటించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వామపక్ష భావజాల విద్యార్థి సంఘం డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ పేరిట వీటిని అంటించారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థులు నిరసనలకు దిగగా, వర్శిటీ యాజమాన్యం కల్పించుకుని వెంటనే వీటిని తొలగించాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించింది. ఇప్పటికే వర్శిటీలో ఎంతో విద్యా సమయం వృథా అయిందని, ఈ తరహా వివాదాలు వద్దని వర్శిటీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. యూనివర్శిటీలోని మంచి వాతావరణాన్ని పాడు చేయాలని అతి కొద్ది మంది చేస్తున్న ప్రయత్నమే ఇదని ఆయన అభివర్ణించారు.