: భారత మహిళపై అమెరికాలో తిట్ల దండకం.. గో బ్యాక్ టు యువర్ కంట్రీ.. అంటూ బెదిరింపులు
అమెరికాలో జాతి వ్యతిరేకత జూలు విదిలిస్తోంది. విదేశీయులపై జాత్యహంకార దాడులు, విద్వేషపూరిత చర్యలు పెరిగిపోతున్నాయి. కాన్సస్‌లో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యకు గురైన తర్వాత కూడా అవి ఆగడం లేదు. తాజాగా న్యూయార్క్‌లో ఉద్యోగం చేస్తున్న భారత సంతతి మహిళ ఏక్తా దేశాయ్‌పై అమెరికన్ ఒకరు తిట్ల దండకం అందుకున్నాడు. డ్యూటీ అనంతరం లోకల్ ట్రైన్‌లో ఇంటికి వెళ్తున్న తన వద్దకు వచ్చిన అమెరికన్ అసభ్య పదజాలంతో తనను దూషించాడంటూ సోషల్ మీడియాలో ఏక్తా పోస్ట్ చేసింది.
‘ఇక్కడికి ఎందుకొచ్చావ్?.. గో బ్యాక్ టు యువర్ కంట్రీ’ అంటూ బెదిరించాడని ఆమె పేర్కొంది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. అయితే తానేమీ అతడితో వాదనకు దిగలేదని ఏక్తా తెలిపింది. తనను దూషించిన అనంతరం రైల్లోని మరో ఆసియన్ యువతి వద్దకు వెళ్లి ఆమెను కూడా అలాగే బెదిరించాడని పేర్కొంది. ఈ ఘటనపై ఏక్తా పోలీసులకు ఫిర్యాదు చేసి మొబైల్‌లో రికార్డు చేసిన వీడియోను వారికి చూపించింది. పోలీసులు ఇప్పటి వరకు అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.