: కేరళలో ఆరెస్సెస్ కార్యాలయంపై బాంబుదాడి.. ఇద్దరి పరిస్థితి విషమం
కేరళ నాదపురం సమీపంలోని కలాచీ వద్ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కార్యాలయంపై గురువారం రాత్రి జరిగిన బాంబుదాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాబు, వినీష్‌లను కోజికోడ్ మెడికల్ కాలేజీకి, సుధీర్, సునీల్‌లను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయంపై క్రూడ్ బాంబు విసిరినట్టు పోలీసులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో సీపీఐ, ఆరెస్సెస్ కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నాయి. కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తలు వరుసగా హత్యకు గురవుతుండడం వెనక ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాత్ర ఉందని, అతని తల తెచ్చిచ్చిన వారికి కోటి రూపాయలు నజరానా ఇస్తానని మధ్యప్రదేశ్‌కు చెందిన ‘షా ప్రచార్ ప్రముఖ్’ కుందన్ చంద్రావత్ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆరెస్సెస్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.