: పవన్ కల్యాణ్ ప్రతిపక్ష పాత్రలో విజయం సాధిస్తారేమోనని జగన్ భయపడుతున్నారు: సోమిరెడ్డి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపక్ష పాత్రలో విజయం సాధిస్తారేమోనని వైఎస్సార్సీపీ అధినేత జగన్ భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతగా జగన్ విఫలమయ్యారని, పవన్ కల్యాణ్ ని జగన్ కాపీ కొడుతున్నారని ఆయన విమర్శించారు.
కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై సోమిరెడ్డి స్పందిస్తూ .. ఉద్యోగ వ్యవస్థను వైఎస్సార్సీపీ అప్రతిష్టపాలు చేస్తోందని, జగన్ మానసిక ఆందోళనతో తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ అడ్డంకిగా మారిందని మండిపడ్డారు. అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్, నిర్దోషిగా తేలేవరకు రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి జరిగిన నష్టంలో మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి పాత్ర కూడా ఉందని సోమిరెడ్డి ఆరోపించారు.