: అప్పుడు మౌనంగా ఉన్న పన్నీర్ సెల్వం.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు?: అన్నాడీఎంకే
మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై అన్నాడీఎంకే నేత నవనీద కృష్ణన్ మండిపడ్డారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం నాడు 'అమ్మ' మృతిపై ఒక రోజు నిరాహారదీక్ష చేపడతానని పన్నీర్ సెల్వం ప్రకటించిన నేపథ్యంలో, కృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయ మరణానంతరం పన్నీర్ ను ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదని... ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను నియమించినప్పుడు కూడా పన్నీర్ తన అనుమానాలను వ్యక్తం చేయలేదని... కానీ, ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆయన రకరకాల ప్రశ్నలను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. అపోలో ఆసుపత్రిలో జయలలితకు వైద్య చికిత్సను సక్రమంగానే అందించారని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాల్లో కలగజేసుకునేందుకు ఎన్నికల సంఘానికి ఎలాంటి అధికారాలు లేవని కృష్ణన్ అన్నారు.