: ఒక పక్క ఆనందం.. మరో పక్క బాధ వున్నాయి!: అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏపీ నవ్యరాజధాని అమరావతిలో నిర్మించిన నూతన అసెంబ్లీ భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తనకు ఒక పక్క ఆనందం.. మరో పక్క బాధ వున్నాయని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఏ శాసనం చేయాలన్నా మన గడ్డపైనే చేయవచ్చని ఆయన హర్షం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు పొలాలుగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు చట్టసభగా మారిందని అన్నారు. ఈ రోజు ఓ చారిత్రాత్మక రోజని అన్నారు.
రాష్ట్రంలో అన్ని వసతులు ఉన్నా, ప్రజల్లో ఎంతో సమర్థత ఉన్నా చరిత్రలో ఎవ్వరూ ఎదుర్కోనన్ని ఇబ్బందులు ఎదుర్కున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు పోరాటంతో ఆంధ్రరాష్ట్రం వచ్చింది. అప్పుడు మద్రాసుని వదిలి కట్టుబట్టలతో వచ్చాం. తర్వాత ఏపీ ఏర్పడడంతో హైదరాబాద్ వచ్చేశామని అన్నారు. మళ్లీ హైదరాబాద్‌ను వదిలి కట్టుబట్టలతో పాటు అప్పులతో వచ్చామని చెప్పారు. తనకు ఎవరూ హై కమాండ్ లేరని, రాష్ట్ర ప్రజలే తన హై కమాండ్ అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను అత్యధిక కాలం ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశానని, మరోవైపు అత్యధిక సంవత్సరాలు సీఎంగా పనిచేశానని ఉన్నారు.