: కేసీఆర్ ఆగ్రహం... అడ్డగోలు ఆపరేషన్లు చేస్తున్నారంటూ ఆరు ఆసుపత్రుల సీజ్
తెలంగాణలోని కొన్ని ఆసుపత్రుల్లో దారుణాలు జరుగుతున్నాయని, డాక్టర్లు అడ్డగోలుగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆరోపణలు వచ్చిన ఆసుపత్రులపై విచారణ తరువాత అవి నిజమేనని తేలగా, ఆరు ఆసుపత్రులను సీజ్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
ఇకపై ఆసుపత్రుల్లో నియంత్రణను మరింత కఠినతరం చేయనున్నామని, తప్పుగా ప్రవర్తించిన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అవసరమున్నా, లేకున్నా ఆపరేషన్స్ చేస్తున్నారన్న ఫిర్యాదులు తనకు అందాయని, ఇలా పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రులకే రావాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మరింతగా మెరుగు పరుస్తామని కేసీఆర్ తెలిపారు.
కాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం, సిజేరియన్లలో తెలంగాణ ముందు నిలిచింది. ప్రసవానికి వచ్చే వారిలో 74.9 శాతం మందికి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఆపై 73.3 శాతంతో త్రిపుర, 70.9 శాతంతో పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.